మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీమంతాలు
మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీమంతాలు
డిఎస్ మాసోత్సవాల్లో భాగంగా బేతలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రాచబండ్ల కొయ్యగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు సీమంతాలు,చిన్నారులకు అన్నప్రాసన,అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోత్ సునీత పాల్గొని చిన్నారులకు అన్నప్రాసన అక్షరాభ్యాసం చేయించారు.ఈ సందర్భంగా గర్భిణులకు పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.గర్భధారణ సమయంలో సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సర్పంచ్ సూచించారు.ఐరన్,కాల్షియం మాత్రలను నిర్లక్ష్యం చేయకుండా తీసుకోవాలని,రక్తహీనతకు దూరంగా ఉండేందుకు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు.ప్రసవ సమయంలో తల్లి, శిశువు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.బాలింతలు ప్రసవానంతరం తగిన విశ్రాంతి తీసుకోవడంతో పాటు పోషకాహారం తీసుకోవాలని,శిశువుకు పుట్టిన వెంటనే తల్లిపాలు అందించి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై సునీత అవగాహన కల్పించారు.శిశువుల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అంగన్‌వాడీ కేంద్రం ద్వారా అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గర్భిణులు,బాలింతలు,చిన్నారుల ఆరోగ్యం,పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే మాసోత్సవాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బానోత్ బాలాజీ,అంగన్వాడి సూపర్వైజర్ సుభద్ర,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత,గర్భిణులు,బాలింతలు,అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి సిద్ధిక్ జూలూరుపాడు