క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే మెరుగైన చికిత్స లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: డాక్టర్ మచ్చ కిరణ్ కుమార్
సూర్య మంచిర్యాల టౌన్: క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మచ్చ కిరణ్ కుమార్ తెలిపారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, జీవనశైలి మార్పులు, పొగాకు వినియోగం, వ్యాధిపై అవగాహన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రముఖ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి వైద్యులను సంప్రదించడం ద్వారా సకాలంలో చికిత్స పొందవచ్చన్నారు.నోటిలో పుండ్లు తగ్గకపోవడం, దీర్ఘకాలంగా దగ్గు కొనసాగడం, శరీరంపై గడ్డలు ఏర్పడటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.40 నుంచి 45 ఏళ్లు దాటిన వారు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మహిళలు రొమ్ము స్వీయ పరీక్షపై అవగాహన కలిగి ఉండాలని, వైద్యుల సలహా మేరకు మామోగ్రఫీ, పాప్ స్మియర్ వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.పొగాకు వినియోగానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, శరీరంలో కనిపించే అసాధారణ మార్పులపై అప్రమత్తంగా ఉండటం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చన్నారు. వ్యాధిని ముందుగానే గుర్తించడం, సరైన సమయంలో వైద్య చికిత్స ప్రారంభించడం ఎంతో కీలకమని వివరించారు.సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సకు ఆధునిక రేడియేషన్ సాంకేతికతతో పాటు రోబోటిక్ శస్త్రచికిత్స వంటి అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ సమావేశంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి మేనేజర్ అంకం మల్లేష్ పాల్గొన్నారు.