కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి:ప్రకృతిలో లభించే పూలను సేకరించి బతుకమ్మగా పేర్చి దేవతగా పూజించే తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా చాటి చెప్పిన మన పండుగ "బతుకమ్మ" అని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్ లతో కలిసి పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనిషి జీవితం ప్రకృతితో మమేకమై ఉంటుందని, బతుకమ్మ పండుగ చెబుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానానికి, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ఈ పండుగ ప్రత్యేక అని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన పండుగ బతుకమ్మ పండుగ అని తెలిపారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతిని భావితరాలకు అందించడంతో పాటు మన సాంప్రదాయాల గొప్పదనాన్ని చాటి చెప్పాలని తెలిపారు. అనంతరం బతుకమ్మ వేడుకలలో మహిళా అధికారులు, ఉద్యోగినులతో కలిసి బతుకమ్మ ఆడారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, మహిళా అధికారులు, ఉద్యోగులు, ఐ సి డి ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.