నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు
కోటేకల్లో పోలీసుల కార్డన్ సెర్చ్.. 28 ద్విచక్ర వాహనాల తనిఖీ, అక్రమ మద్యం విక్రయదారుడి అరెస్ట్
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామంలో గురువారం ఉదయం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ ఏ. శ్రీనివాసులు పర్యవేక్షణలో రూరల్ సీఐ ఎస్. చిరంజీవి, ఎస్ఐలు కె. శ్రీనివాసులు, ఎం. తిమ్మారెడ్డి సహా 60 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
గ్రామంలోని అనుమానితులు, రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీ చేసి, అల్లర్లు, గొడవలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 28 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, రికార్డులు పరిశీలించిన అనంతరం యజమానులకు అప్పగించారు.
అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న తెలుగు రాఘవేంద్ర వద్ద 180 ఎంఎల్ పరిమాణం గల 50 చీప్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని, అతడిని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా సీఐ ఎస్. చిరంజీవి మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పోలీసుల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గంజాయి, మద్యం, పేకాట, మట్కా వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే 1930కు ఫోన్ చేయాలని, మాదకద్రవ్యాల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు. బాల్యవివాహాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.