దీర్ఘకాలిక యుద్ధమే మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు
సూర్య అంతర్జాతీయ డెస్క్: మధ్యప్రాచ్యం మరియు మధ్య ఆసియా ప్రాంతాల్లో నిరంతరం కొనసాగుతున్న సుదీర్ఘ పోరాటాలు, యుద్ధ వాతావరణం అలాగే సరఫరా గొలుసుల విచ్ఛిన్నమే ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థల వృద్ధిక అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా పరిణమించాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఈ యుద్ధ తీవ్రత కారణంగా 2026 సంవత్సరంలో మధ్యప్రాచ్య మరియు మధ్య ఆసియా ప్రాంత జీడీపీ తీవ్రంగా క్షీణించి ఏకంగా 0.3 శాతం సంకోచాన్ని నమోదు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గతంలో అంచనా వేసిన 1.9 శాతం వృద్ధి రేటు స్థానంలో ఈ స్థాయిలో క్షీణత నమోదు కావడం ఆర్థిక సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది.
ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు మరియు వాణిజ్య నౌకల రాకపోకలు దీర్ఘకాలం నిలిచిపోవడం, సముద్ర మార్గాల్లో రవాణా ప్రతిబంధకాలు ఎదురుకావడం వల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రపంచంలో ఐదవ వంతు చమురు సరఫరా అయ్యే ఈ కీలక జలసంధి మూసివేత వల్ల చమురు ఎగుమతి దేశాలైన కువైట్, ఇరాక్, ఖతార్ వంటి దేశాల జీడీపీ దారుణంగా పడిపోయి రెండంకెల స్థాయిలో ప్రతికూల వృద్ధిని చవిచూసే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. అలాగే యుద్ధం మరియు ఆంక్షల దెబ్బకు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా దాదాపు 7.6 శాతం సంకోచించే అవకాశం ఉందని అంచనా వేసింది.
అంతర్జాతీయంగా ముడిచమురు మరియు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల ప్రపంచ ద్రవ్యోల్బణం పెరిగి ఇతర దేశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గి, సముద్ర వాణిజ్య మార్గాలు పునరుద్ధరించబడితే తప్ప మధ్యప్రాచ్య ప్రాంతం మళ్లీ కోలుకోవడం సాధ్యపడదని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో ప్రాంతీయ శాంతి నెలకొనకపోతే ఈ ఆర్థిక నష్టం మరింత తీవ్రరూపం దాల్చి గ్లోబల్ సప్లై చైన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.