సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు
సిద్దిపేట ; భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా పరిధిలోని 32-హుస్నాబాద్, 33-సిద్దిపేట, 41-దుబ్బాక, 42-గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో 2026 అక్టోబర్ 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కే హైమావతి తెలిపారు ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణలో భాగంగా గైర్హాజరు, వలస వెళ్లిన, మరణించిన మరియు డూప్లికేట్ ఓటర్ల జాబితా (ఏఎస్డీడీ)లో పేరు తొలగించబడిన ఓటర్లకు, అలాగే తొలిసారిగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే 18 సంవత్సరాలు నిండిన యువతకు, ఓటరుగా నమోదు కావడానికి అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు నమోదు కాని వారికి భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల్లో ఈ రెండు రోజుల్లో ఫారం-6 సమర్పించిన వారి వివరాలను నవంబర్ 9న ప్రచురించే తుది జాబితాలో చేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ రెండు రోజులు పాటు సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. ఓటరు నమోదు ప్రక్రియలో ప్రజలకు సహకరించాలని తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా శిబిరాల్లో పాల్గొనాలని కోరారు.అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో చేరాలి, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదు* అనే లక్ష్యంతో ఈ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, అర్హత ఉన్నవారు కొత్తగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు.