ఇజ్జత్నగర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కొండాపూర్,మేజర్ న్యూస్ :మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పా పార్క్లో ఉన్న ఉదయ క్రెసెంట్ వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు, స్థానిక ప్రముఖులతో కలిసి గంగల రాధాకృష్ణ యాదవ్ పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణమంతా పండుగ శోభతో కళకళలాడింది.ఈ సందర్భంగా గంగల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి సంప్రదాయాల వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న మన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ బతుకమ్మ వేడుకలు స్థానిక మహిళల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పాయి.