వేదపాఠశాలలో వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, శ్రీమంతుని.. వేదపండితుల వేదాశీర్వచనం!
సూర్య ఆధ్యాత్మిక డెస్క్: నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారులోని తొర్రూర్ వద్ద ఉన్న శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్‌లో ఘనంగా వస్త్ర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దసరా నవరాత్రుల శుభసందర్భంగా ట్రస్ట్ చైర్మన్ నందమూరి మోహన కృష్ణ మార్గదర్శకత్వంలో నందమూరి మోహన రూపా మరియు నందమూరి శ్రీమంతుని ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాపీఠమ్‌లోని వేద పండితులకు, గురువులకు, పెద్దలకు మరియు వేద విద్యార్థులకు తమ స్వహస్తాలతో నూతన వస్త్రాలను అందజేసి సేవా నిరతిని చాటుకున్నారు.
భారతీయ సనాతన ధర్మం, సంప్రదాయాలు, సంస్కృతి మరియు నైతిక విలువలను నేర్పిస్తూ భవిష్యత్ తరాలకు వేద విద్యను అందిస్తున్న ఈ గురుకులంలో వస్త్రదానం చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు. దసరా నవరాత్రుల వేళ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని అక్కడ ఉన్న ముత్తైదువులకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యాపీఠమ్ వేదపండితులు వారికి మంత్రపూర్వకంగా వేదాశీర్వచనం అందించి, దుశ్శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా విద్యాపీఠమ్ నిర్వహకులు మరియు వేద పండితులు మాట్లాడుతూ నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. వేద విద్యార్థులకు మరియు ఆశ్రమానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ అండగా నిలుస్తున్న నందమూరి మోహన కృష్ణ, మోహన రూపా, శ్రీమంతునిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మవారి దివ్యానుగ్రహంతో ఈ దాతలు నిరంతరం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని, వారి సేవలు మరింత మందికి అందాలని వేద పాఠశాల ప్రతినిధులు దుర్గాభవానిని ప్రార్థించారు.
Also Read: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే