దేవాదుల, ,ఎస్సారెస్పీ నీళ్ల కోసం ఎర్రబెల్లి విజ్ఞప్తి
*దేవాదుల, ఎస్సారెస్పీ నీళ్ల కోసం ఎర్రబెల్లి విజ్ఞప్తి*
*మంత్రి ఉత్తమ్‌కు రైతుల గోడు వివరించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి*
*రెండు రోజుల్లో దేవాదుల నీళ్లు విడుదల చేస్తామని హామీ*
హైదరాబాద్: (దేవరుప్పుల) అక్టోబర్ 02 మేజర్ న్యూస్ (సూర్య):
దేవాదుల, ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందక పంటలు ఎండిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసిన ఎర్రబెల్లి దయాకర్ రావు. సాగునీటి కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దేవాదుల, ఎస్సారెస్పీ నీటిని వెంటనే విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని ఆయన మంత్రిని కోరారు. ఇప్పటికే వరి నాట్లు వేసిన పలువురు రైతులు నీరు అందక నారుమడులు, పంటలు ఎండిపోవడంతో నష్టపోయారని తెలిపారు. కనీసం రానున్న పంటకైనా సమయానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎర్రబెల్లి తెలిపారు. అలాగే ఎస్సారెస్పీ నీటి విడుదలపై సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నట్లు చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.