చింతపల్లిలో హెచ్‌డీపీఎస్ పత్తిపై రైతులకు శిక్షణా కార్యక్రమం*.
చింతపల్లి మేజర్ న్యూస్ : మిషన్ ఆన్ కాటన్ ప్రొడక్టివిటీ కార్యక్రమంలో భాగంగా హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ (HDPS) పత్తి సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం చింతపల్లి రైతు వేదిక లో గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు హెచ్‌డీపీఎస్ పత్తి సాగులో అధిక మొక్కల సాంద్రత, వరుసల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం, మొక్కల పెరుగుదల నియంత్రణ, పంటలో సరైన కేనపీ అభివృద్ధి మరియు తెగుళ్ల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
హెచ్‌డీపీఎస్ పద్ధతిలో ఎకరాకు సుమారు 25,000–30,000 మొక్కల సాంద్రత సాధించేలా సాగు చేయవచ్చని, సాధారణ పత్తి సాగుతో పోలిస్తే అధిక మొక్కల సంఖ్య ద్వారా ఉత్పాదకత పెంచే విధానమని రైతులకు వివరించారు. అలాగే సుమారు 60 సెం.మీ. వరుసల మధ్య దూరం, 10 సెం.మీ. మొక్కల మధ్య దూరం పాటించడం ద్వారా అధిక మొక్కల సాంద్రత సాధించవచ్చని తెలిపారు.
పత్తి మొక్కల అధిక పెరుగుదలను నియంత్రించేందుకు మొక్కల పెరుగుదల నియంత్రకాలు (Plant Growth Regulators) వినియోగం, పంట పరిస్థితికి అనుగుణంగా సరైన యాజమాన్య పద్ధతులు, చీడ పీడల నివారణ పద్ధతులు పాటించడం గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏడీఏ. దేవరకొండ శ్రీలక్ష్మి , ఎంఏఓ. చింతపల్లి శ్రావణ కుమారి , ఏఈఓ .మౌనిక , రైతులు తదితరులు పాల్గొన్నారు.