భారీగా మత్తు పదార్థాల పట్టివేత
- 80 గ్రాముల మెథాంఫెటమైన్, 4 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం
- ముగ్గురు అరెస్ట్, ఇద్దరు పరారీ
శంషాబాద్‌లో మత్తు పదార్థాల విక్రయానికి పాల్పడుతున్న ముఠాను ఆర్జీఐఏ పోలీసులు పట్టుకున్నారు. సంపత్‌నగర్ రోడ్డులోని హెచ్ఎండీఏ నర్సరీ సమీపంలో సోమవారం నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 80 గ్రాముల మెథాంఫెటమైన్, 4 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో సయ్యద్ సయీద్ హుస్సేన్ అలియాస్ లంబా (38), మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ షుకూర్ (32), రహ్మానుద్దీన్ అలియాస్ లాలా (29) ఉన్నారు. పోలీసుల దర్యాప్తులో బెంగళూరుకు చెందిన పెడ్లర్ జంషెడ్ నుంచి డ్రగ్స్ తెప్పించి స్థానికంగా విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన పెడ్లర్ జంషెడ్‌తో పాటు సబ్ పెడ్లర్ సయ్యద్ జోహైర్ మెహదీ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లంబాపై 270కు పైగా చోరీ కేసులు, ఇమ్రాన్‌పై మూడు ఎన్‌డీపీఎస్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, నిల్వకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఏసీపీ వి. శ్రీకాంత్ గౌడ్ ప్రజలను కోరారు.
- పోతుల నర్సింహా : మేజర్ న్యూస్, శంషాబాద్.