ఘనంగా ప్రారంభమైన జాతర మహోత్సవం -పోలేరమ్మ జాతరతో పులకించిన వెంకటగిరి -జాతరకు రాష్ట్ర పండుగా హోద... 50 లక్షలు మంజూరు -ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు -పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి - అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం - జై పోలేరమ్మ తల్లి నినాదాలతో మారి మ
తిరుపతి జిల్లా వెంకటగిరిలో కొలువైన గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా ప్రారంభమైంది. జగన్మాత దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం "పోలేరమ్మ తల్లికి జై" నినాదాలతో మార్మోగింది.పోలేరమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో తొలిరోజు వేడుకలకు విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.
పట్టు వస్త్రాల సమర్పించిన మంత్రి ఆనం
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ -"శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించాం" అని తెలిపారు.
జాతరకు రూ.50 లక్షలు - ఆలయంలో రూ.1.70 కోట్ల ఎఫ్.డీ
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నామని, ప్రతి పండుగకు దేవాదాయ శాఖ తరపున ఏటా రూ.50 లక్షలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. పోలేరమ్మ జాతరకు ఈ ఏడాది రూ.50 లక్షలు మంజూరు చేసి తొలి విడతగా రూ.40 లక్షలు విడుదల చేశామన్నారు. ఆలయ ఖాతాల వివరాలు ఇచ్చాక మిగిలిన రూ.10 లక్షలు విడుదల చేస్తామన్నారు. భక్తులు, దాతల సహకారంతో అమ్మవారికి బంగారు కిరీటం, బంగారు పాదాలు, హస్తాలు, స్వర్ణహారాలు సమకూరాయని, ప్రస్తుతం ఆలయానికి రూ.1.70 కోట్లు ఫిక్సెడ్ డిపాజిట్ గా, ఎస్బీఐ ఖాతాలో రూ.25 లక్షలు జమ ఉన్నాయని వెల్లడించారు.
ఆలయాల అభివృద్ధికి కోట్ల నిధులు
వెంకటగిరి నియోజకవర్గంలో 4 ఆలయాలకు ధూప దీప నైవేద్యాల కింద ఏటా రూ.4.80 లక్షలు, 3 ఆలయాల అభివృద్ధికి రూ.7.05 కోట్లు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 13 ఆలయాల నిర్మాణానికి రూ.4.60 కోట్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు.
అటవీ ప్రాంతంలోని శ్రీచెంచులక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తున్నందున మౌలిక వసతులు కల్పిస్తామని, రాపూరు మండలం పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దత్తత ఆలయంగా అనుసంధానించి నిధులు సమకూరుస్తామన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో అమరావతి పూర్తి కావాలి - ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని ప్రార్థించామన్నారు. వర్షాల నేపథ్యంలో క్యూ లైన్లలో భక్తులకు ఎండ తగలకుండా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశామన్నారు.
భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం - కలెక్టర్
కలెక్టర్ డా.వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రతి భక్తుడికి సురక్షిత, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యమని, క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్, భద్రతపై అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ మహేశ్వర రెడ్డి, ప్రత్యేక అధికారి విజయరాజు, జిల్లా ఎండోమెంట్ అధికారి రామకృష్ణ, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఆలయ చైర్మన్ మురళీకృష్ణ, తహసీల్దార్ శిరీష, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి