telanagana
బతుకమ్మ వేడుకలకు ముస్తాబు
సూర్య, భీమ్గల్ : బతుకమ్మ పండుగ వేడుకల కోసం భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామం ముస్తాబవుతోంది. గ్రామ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా పండుగ సంబరాల్లో పాల్గొనేలా గ్రామ సర్పంచ్ ఎంఏ. సమీర్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని చెరువు వద్ద ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాక్టర్తో మొరం పోయించి పరిసరాలను చదును చేయించారు. మహిళలు బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో పండుగను జరుపుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు.పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా ప్రజల సౌకర్యాలకు, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఏర్పాట్లు చేపట్టడం అభినందనీయమని పేర్కొంటున్నారు.ఈ ఏర్పాట్లలో ఉప సర్పంచ్ గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, కారోబార్ ఇమ్రాన్ పాల్గొన్నారు.