అధికారులకు గట్టి హెచ్చరిక
!హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సంబంధిత అధికారులను ఆయన గట్టిగా నిలదీశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ముప్పు ఉంటుందని ముందే తెలిసినప్పటికీ, తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచడంలో ఎందుకు విఫలమయ్యారని అధికారులను ప్రశ్నించారు. తగినన్ని బొగ్గు లింకేజీలు అందుబాటులో ఉన్నప్పటికీ యాదాద్రి థర్మల్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ప్రారంభం కాలేదని నిలదీశారు. ఎండాకాలంలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు రైతులకు ఎలాంటి కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరా విషయంలో ఇకపై ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా, బాధ్యులైన ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.