10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు: ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను అక్టోబర్ 10 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. వేడుకల్లో భాగంగా చివరి రోజైన అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ బతుకమ్మ ర్యాలీ చేపడుతుండటంతో, ట్యాంక్‌బండ్‌పై సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
బతుకమ్మల నిమజ్జనం కోసం బతుకమ్మ ఘాట్‌తో పాటు నెక్లెస్ రోడ్‌లోనూ ప్రత్యేక ఏర్పాట్లు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అంతేకాకుండా, రవీంద్రభారతిలో 10 రోజుల పాటు వరుసగా వివిధ సాంస్కృతిక బతుకమ్మ ఉత్సవాలు జరగనుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేకంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం ఒక ప్రత్యేక లోగోను రూపొందిస్తోంది, ఈ లోగోలో రాబోయే 'తెలంగాణ గ్లోబల్ సమ్మిట్' అంశాన్ని ప్రాధాన్యతతో చేర్చనున్నారు.