పారిజాతగిరిలో పవిత్రోత్సవాలు ప్రారంభం
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు శనివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భూవరాహస్వామి దర్శనం చేసుకున్న కంకణధారులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో పాల్గొన్నారు.భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శనం, ప్రసాదం, అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈఓ మణికల రాంబాబు తెలిపారు. పవిత్రోత్సవాలు అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు కొనసాగుతాయని అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు తెలిపారు. శనివారం వివిధ పూజలు, ప్రసాదాలు, విరాళాల ద్వారా రూ.1,39,900 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కె.వి.రమణారావు జంగారెడ్డిగూడెం