పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
భీమవరం, మేజర్ న్యూస్: విధి నిర్వహణలో నిరంతరం ప్రజల రక్షణకు కృషి చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్ తెలిపారు. భీమవరంలోని వర్మ హాస్పిటల్స్ సహకారంతో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని అన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్యం పొందేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.వర్మ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో గుండె, కిడ్నీ, లివర్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, మూత్ర పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బంది, హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. శిబిరం నిర్వహణకు సహకరించిన వర్మ హాస్పిటల్స్ యాజమాన్యం, వైద్య బృందానికి జిల్లా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్, వర్మ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ పి.ఆర్.కె. వర్మ, ఏఆర్ డీఎస్పీ ఎం.వి.వి. సత్యనారాయణ, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కె.వి.వి.ఎన్. సత్యనారాయణ, మహిళా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (అడ్మిన్) ఇ. ఇందుమతి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్. మోజేష్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ భీమవరం