ఫుట్‌బాల్ చరిత్రలోనే సంచలనం: ఒక్క మ్యాచ్‌లో ఏకంగా 51 రెడ్ కార్డ్‌లు జారీ.. బద్దలైన ప్రపంచ రికార్డు
సూర్య క్రీడా డెస్క్: ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలో మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత అసాధారణమైన ఘటన చోటుచేసుకుంది. ఆటలో క్రీడాకారుల మధ్య స్వల్ప వివాదాలు, గొడవలు జరగడం సాధారణమే అయినప్పటికీ, బ్రెజిల్‌లో జరిగిన ఒక అండర్-20 ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పూర్తిగా అరుదైన మరియు విస్మయపరిచే పరిణామం చోటుచేసుకుంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య చెలరేగిన తీవ్రమైన ఘర్షణ కారణంగా మ్యాచ్ రెఫరీ ఏకంగా 51 మందికి రెడ్‌కార్డ్‌లు జారీ చేయాల్సి వచ్చింది. ఈ అనూహ్య పరిణామంతో ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక రెడ్‌కార్డ్‌లు నమోదైన సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించబడింది.
బ్రెజిల్‌లో ఉబెర్లాండియా మరియు మామోరే జట్ల మధ్య జరిగిన అండర్-20 సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ అనూహ్య ఘటన వెలుగు చూసింది. మ్యాచ్ రెండో అర్ధభాగంలో మామోరే జట్టు మూడు ఒకటి గోల్స్ తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సమయంలో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఒక గోల్ సాధించిన తర్వాత జరిగిన వివాదాస్పద సంబరాలు రెండు జట్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి, ఆపై భౌతిక దాడికి దారితీశాయి. క్షణాల వ్యవధిలో మైదానం ఒక రణరంగంగా మారిపోవడంతో ఆటగాళ్లతో పాటు సబ్స్టిట్యూట్ బెంచ్‌లో ఉన్నవారు, కోచింగ్ సిబ్బంది, ఇతర టెక్నికల్ స్టాఫ్ కూడా మైదానంలోకి దూసుకొచ్చి కొట్లాటకు దిగారు.
పూర్తిగా అదుపు తప్పడంతో మ్యాచ్‌ను కొనసాగించడం అసాధ్యమని భావించిన రెఫరీ మ్యాచ్‌ను మధ్యలోనే రద్దు చేయవలసి వచ్చింది. అనంతరం మ్యాచ్ అధికారుల అధికారిక నివేదిక ప్రకారం, ఈ హింసాత్మక ఘటనలో పాల్గొన్న 43 మంది ఆటగాళ్లు, 8 మంది సపోర్ట్ సిబ్బందితో పాటు మొత్తం 51 మందికి రెడ్‌కార్డ్‌లు జారీ చేసినట్లు స్పష్టమైంది. గతంలో 2011లో అర్జెంటీనాలో జరిగిన ఒక మ్యాచ్‌లో 36 రెడ్‌కార్డ్‌లు చూపించడమే ఇప్పటివరకు ఉన్న రికార్డు కాగా, తాజా ఘటన ఆ రికార్డును పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఫుట్‌బాల్ మైదానంలో జరిగిన ఈ మూకదాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోతోంది.
Also Read: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య