sports
నికోలస్ పూరన్ రీ-ఎంట్రీ?
పోర్ట్ ఆఫ్ స్పెయిన్:వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్, ధనాధన్ బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ రీ-ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంటర్నేషనల్ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలకలేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని వ్యాఖ్యానించడం ద్వారా తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే సూచనలు కనిపించాయి. ప్రస్తుతం యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంపైనే తన దృష్టి ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
వెస్టిండీస్ జట్టు తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక ఆటగాడిగా రాణించిన పూరన్, 2025 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, జాతీయ జట్టులోకి వచ్చేందుకు తలుపులు పూర్తిగా మూసివేయలేదని తాజాగా పేర్కొనడంతో ఆయన రీ-ఎంట్రీపై కరేబియన్ క్రికెట్ వర్గాల్లో మళ్లీ చర్చ ప్రారంభమైంది. తన కెరీర్‌లో వెస్టిండీస్ తరఫున వన్డేల్లో 1,983 పరుగులు, అంతర్జాతీయ టీ20ల్లో 2,275 పరుగులు సాధించిన రికార్డు ఆయన సొంతం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ టి20 లీగ్‌లలో మెరుపులు మెరిపిస్తున్న పూరన్ నిర్ణయం మారితే, రాబోయే ఐసీసీ టోర్నీల్లో వెస్టిండీస్ జట్టుకు మరిన్ని మెరుగైన అవకాశాలు లభించే అవకాశముంది.