అరంగేట్ర టెస్టులో సంచలనం సృష్టించిన పాకిస్తాన్ బౌలర్ సాకిబ్ ఖాన్.. అరుదైన రికార్డు నమోదు!
సూర్య క్రీడా డెస్క్: శ్రీలంకతో రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ యువ పేసర్ సాకిబ్ ఖాన్ అరంగేట్రంలోనే అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ ఆరంగేట్ర మ్యాచ్‌లోనే ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్ వర్గాల దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్ తరఫున టెస్ట్ డెబ్యూ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా సాకిబ్ ఖాన్ రికార్డులకెక్కాడు.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సాకిబ్ ఖాన్ తనఘాటైన అవుట్ స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మ్యాచ్ మూడో రోజు ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచిన లంక జట్టు, నాల్గో రోజు ఉదయం సెషన్‌లో సాకిబ్ ఖాన్ దెబ్బకు పూర్తిగా కుప్పకూలింది. పదునైన బంతులతో లంక మిడిల్ ఆర్డర్ మరియు టెయిలర్లను పెవిలియన్‌కు పంపిన సాకిబ్, మొత్తం 34 ఓవర్లు బౌలింగ్ చేసి 130 పరుగులు ఇచ్చి 7 వికెట్లు కైవసం చేసుకున్నాడు. ఈ సంచలన ప్రదర్శన కారణంగా శ్రీలంక జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 446 పరుగులకు ఆలైట్ అయింది.
పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో గతంలో మొహమ్మద్ నజీర్, మొహమ్మద్ జాహిద్ మరియు అబ్రార్ అహ్మద్ మాత్రమే టెస్ట్ అరంగేట్రంలో ఏడు వికెట్ల ఘనత సాధించగా, ఇప్పుడు ఆ సరసన సాకిబ్ ఖాన్ కూడా చేరడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో సాకిబ్ విజృంభణ కారణంగా శ్రీలంక జట్టు కేవలం 12 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని మాత్రమే సాధించగలిగింది. అరంగేట్రంలోనే అసాధారణ బౌలింగ్‌తో పాకిస్తాన్ జట్టును రేసులోకి తీసుకువచ్చిన సాకిబ్ ఖాన్‌పై ప్రస్తుతం మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
Also Read: నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం.. హ్యాట్రిక్‌తో పాటు రికార్డు నమోదు చేసిన సందీప్ లమిచానే!