కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు ప్రధాని మోదీ వీడియో కాల్ ..వందలాది ప్రాణాలు కాపాడిన ధైర్యానికి ప్రశంసలు..
సూర్య జాతీయ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మందిని కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని, దేశం మొత్తం ఆయన కోసం ప్రార్థనలు చేస్తోందని, అనేక చోట్ల మహామృత్యుంజయ జపం జరుగుతోందని చెప్పారు. కెప్టెన్ ధైర్యం, సహనం, సమయస్ఫూర్తి వల్లే ఇన్ని ప్రాణాలు నిలిచాయని ప్రశంసించారు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానం కాక్‌పిట్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం కో పైలట్ దాడిలో కెప్టెన్ స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడి కాక్‌పిట్ నేలపై పడి ఉన్నా, చివరి శక్తిని కూడగట్టుకుని లోపలి నుంచి తలుపు తెరిచారని ఆయన ప్రధానితో చెప్పారు. ఇతరులు ప్రాణాలు కోల్పోకూడదన్న సంకల్పంతోనే ఇలా చేశానని వివరించారు. తలుపు తెరుచుకోవడంతో లోపలికి వచ్చిన ఇతరులు కో పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలోని 170 మందికి పైగా ప్రయాణికులంతా సురక్షితంగా ఇజ్రాయెల్ చేరుకున్నారు.
గాయపడిన కెప్టెన్ స్మిత్‌ను మొదట సౌదీ అరేబియాలోని తబుక్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని, అనంతరం మెరుగైన వైద్యం కోసం అబుదాబికి తరలించారని తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ప్రధాని మోదీ గురువారం కెప్టెన్ తండ్రి భూపేంద్రభాయ్, తల్లి గీతాబెన్, భార్య సోనల్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కెప్టెన్ స్మిత్‌ను నిజమైన హీరోగా అభివర్ణించారని ప్రధాని మోదీ తెలిపారు. ఒక భారతీయుడు పెను విషాదాన్ని తప్పించాడంటూ నెతన్యాహు ప్రశంసించారని కూడా ఆయన గుర్తుచేశారు. ప్రాణాలు తీసేవారు కాదు, ప్రాణాలు కాపాడేవారే భారతీయులని కెప్టెన్ చాటిచెప్పారని, దేశమంతా గర్వపడుతోందని ప్రధాని అన్నారు. కెప్టెన్ దీర్ఘాయుష్షు, ఉత్తమ ఆరోగ్యం కోసం ప్రార్థించాలని దేశప్రజలను కోరారు.
కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. వారణాసిలోని కాశీ విశ్వనాథ ధామ్‌లో 21 మంది పండితులు రుద్రాభిషేకం నిర్వహించగా, మరో 11 మంది పండితులు లక్ష మహామృత్యుంజయ మంత్రాలను జపిస్తున్నారని ఆలయ ట్రస్టు తెలిపింది. సోమనాథ ఆలయంలోనూ ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్నారు. 17 ఏళ్లుగా విమానాలు నడుపుతున్న ఈ పైలట్ ధైర్యసాహసాలు ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి.