భారత్-పోర్చుగల్ ద్వైపాక్షిక సంబంధాల సమీక్ష..2027–2032 ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌పై దృష్టి
సూర్య జాతీయ డెస్క్: భారత్ మరియు పోర్చుగల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమీక్షతో పాటు రాబోయే ఐదేళ్లకు సంబంధించిన వ్యూహాత్మక సహకార ప్రణాళికపై రెండు దేశాలు దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య జరిగిన ఆరో విడత విదేశాంగ కార్యాలయ సంప్రదింపులలో రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ మరియు భద్రత, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ సాంకేతికత, పర్యాటకం, విద్య, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాలలో పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. మునుపటి సమావేశం తర్వాత వివిధ రంగాలలో సాధించిన స్థిరమైన పురోగతి పట్ల ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేస్తూ, పెండింగ్‌లో ఉన్న ఒప్పందాలను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాయి.
ఉన్నత స్థాయి రాజకీయ సంప్రదింపులు, ప్రైవేట్ రంగంలో విస్తరిస్తున్న వాణిజ్య సంబంధాల నేపథ్యంలో 2027–2032 కాలానికి భారత్-పోర్చుగల్ సంబంధాల కోసం సమగ్ర ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయాలన్న తమ నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక సహకారాన్ని నడిపించే వ్యూహాత్మక మార్గదర్శకంగా ఈ రోడ్‌మ్యాప్ నిలవనుంది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో ఏర్పాటైన సంస్థాగత యంత్రాంగాల ద్వారా క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడాన్ని స్వాగతించిన ఇరుపక్షాలు, అన్ని రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత గాఢం చేయాలని నిర్ణయించాయి.
భారత్ మరియు యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు స్వాగతించాయి. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చలు పూర్తవడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆ ఒప్పందంపై సంతకాలు చేసి అమలులోకి తీసుకురావడంపై ఆశాభావం వ్యక్తం చేశాయి. ఇండో-పసిఫిక్, పశ్చిమాసియాతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చలు జరిగాయి.
ఐక్యరాజ్యసమితి సహా వివిధ బహుళజాతి వేదికలలో ఇరు దేశాలు సన్నిహిత సహకారాన్ని కొనసాగించాలని అంగీకరించాయి. తదుపరి విడత విదేశాంగ కార్యాలయ సంప్రదింపులను ఇరు దేశాలకు అనుకూలమైన తేదీలలో పోర్చుగల్‌లో నిర్వహించాలని భారత్ మరియు పోర్చుగల్ నిర్ణయించాయి.