నౌకా నిర్మాణ రంగం, మైన్ కౌంటర్ మెజర్స్ సహకారంపై భారత్-జపాన్ దృష్టి: వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ జపాన్ పర్యటన!
సూర్య రక్షణ డెస్క్: భారత్, జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సముద్ర భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత నావికాదళ వైస్ చీఫ్ (Vice Chief of Naval Staff) జపాన్‌లో అధికారిక పర్యటన చేపట్టారు. ఇరు దేశాల నౌకాదళాల మధ్య సంయుక్త నౌకా నిర్మాణం (షిప్‌బిల్డింగ్), అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ మరియు సముద్రపు మందుపాతర్లను నిర్వీర్యం చేసే ‘మైన్ కౌంటర్ మెజర్స్’ (MCM) రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించారు.
జపాన్ మారిటైమ్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్ (JMSDF) అగ్రశ్రేణి సైనిక నాయకత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో వైస్ చీఫ్ ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, నిబంధనల ఆధారిత సముద్రయాన భద్రతను పరిరక్షించడంలో ఇరు నావికాదళాల మధ్య పరస్పర కార్యాచరణ సామర్థ్యాన్ని (ఇంటర్‌ఆపరబిలిటీ) పెంచడంపై చర్చించారు. ముఖ్యంగా భారత రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' కింద నౌకా నిర్మాణం, యుద్ధ నౌకల నిర్వహణ, మరమ్మతులు (MRO) చేపట్టడంలో జపాన్ నైపుణ్యాన్ని వినియోగించుకోవడానికి గల అవకాశాలను పరిశీలించారు.
సముద్ర మార్గాల్లో రక్షణ కల్పించే మైన్ స్వీపర్లు, అత్యాధునిక అండర్‌వాటర్ సెన్సార్లు, మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ రూపకల్పనలో జపాన్ కలిగి ఉన్న సాంకేతిక నైపుణ్యం భారత నావికాదళ అవసరాలకు ఎంతగానో ఉపకరిస్తుందని ఇరు పక్షాలు అభిప్రాయపడ్డాయి. సంయుక్త సైనిక విన్యాసాలు (జిమెక్స్, మలబార్) కొనసాగిస్తూనే.. సాంకేతిక సహకారాన్ని నూతన స్థాయికి చేర్చేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని రక్షణ వర్గాలు వెల్లడించాయి