రబ్బీ యోస్సీ మిజ్రాచీ వ్యాఖ్యలపై దుమారం: అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్: హిందూ మత విశ్వాసాలు, గోపూజపై వివాదాస్పద మరియు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెలీ-అమెరికన్ రబ్బీ (యూదు మత గురువు) యోస్సీ మిజ్రాచీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఒక ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత్‌తో పాటు ఇజ్రాయెల్‌లోని వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు జాతివివక్ష పూరితంగా ఉన్నాయని, ఇతర మతాల విశ్వాసాలను అవమానించేలా ఉన్నాయని నెటిజన్లు, పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైరల్ అయిన వీడియోలో మిజ్రాచీ మాట్లాడుతూ, గతంలో తన సోషల్ మీడియా నిర్వహణ కోసం పనిచేసిన ఒక భారతీయుడి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ సందర్భంలో హిందూ సమాజం గోవులను ఆరాధించే విధానాన్ని, సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ అత్యంత అభ్యంతరకర పోలికలు తీసుకువచ్చారు. ఢిల్లీలోని ట్రాఫిక్ పరిస్థితులు, భారత వైద్యులను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నవ్వడం వీడియోలో కనిపించింది.
ఈ ప్రసంగం బయటకు రావడంతో నెటిజన్లతో పాటు ఇజ్రాయెల్ మేధావుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇజ్రాయెల్ రచయిత, పరిశోధకుడు యెషాయా రోసెన్‌మాన్ స్పందిస్తూ, ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు ఇజ్రాయెల్ ప్రతిష్టకు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. గతంలోనూ పలు వర్గాలను అవమానించిన చరిత్ర మిజ్రాచీకి ఉందని ఆయన గుర్తుచేశారు. మరోవైపు భారత దేశంలో పాలస్తీనా రాయబారి అబ్దుల్లా ఎం అబూ షావేష్ కూడా ఈ పరిణామంపై పరోక్షంగా స్పందిస్తూ, ఏ మత విశ్వాసాలనైనా కించపరచడం సమాజ ఉనికికే ప్రమాదకరమని, వివక్షాపూరిత వైఖరిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.