వైరల్ ఫీవర్ తగ్గాక కూడా దగ్గు వదలట్లేదా.. వైద్యులు చెబుతున్న అసలు కారణాలు ఇవే!
సూర్య లైఫ్‌స్టైల్ డెస్క్: ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలామంది వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గినప్పటికీ కొందరిలో మాత్రం దగ్గు మాత్రం సులభంగా తగ్గకుండా చాలా రోజుల పాటు వేధిస్తూనే ఉంటుంది. సాధారణంగా జ్వరం తగ్గిపోయినా వారాల తరబడి వేధించే ఈ పొడి దగ్గు లేదా కఫంతో కూడిన దగ్గు కారణంగా రోగులు తీవ్రమైన శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు జ్వరం తగ్గాక కూడా దగ్గు ఎందుకు అంతగా పట్టు విడువకుండా ఉంటుందనే దానిపై ప్రముఖ వైద్య నిపుణులు పలు కీలక విషయాలను వెల్లడించారు. వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు శ్వాసనాళాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని, దీనివల్ల ఊపిరితిత్తులు మరియు గొంతు భాగంలో ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
వైరల్ ఫీవర్ సమయంలో శ్వాసకోశ వ్యవస్థలోని మ్యూకస్ మెంబ్రేన్ దెబ్బతింటుందని, దీనివల్ల గొంతు భాగంలో సున్నితత్వం పెరిగి నిరంతరం దగ్గు వచ్చేలా ప్రేరేపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. జ్వరం నయమైనా కూడా ఆ ఇన్ఫెక్షన్ ప్రభావం ఊపిరితిత్తులపై కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. దాంతో గొంతులో గరగర, ఇరిటేషన్ ఏర్పడి దగ్గు అస్సలు తగ్గదు. అయితే దీనిని కేవలం సాధారణ దగ్గుగా తేలిగ్గా తీసుకుంటే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని, కొన్నిసార్లు ఇది బ్రాంకైటిస్ లేదా సైనస్ సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఫీవర్ తగ్గిన తర్వాత కూడా దగ్గు ఇబ్బంది పెడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.
ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే వేడి నీటిని తరచుగా తీసుకోవడం, గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించడం వంటి గృహ వైద్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే చల్లటి పదార్థాలు, నూనెలో వేయించిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ తేనె, అల్లం రసం వంటి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ దగ్గు రెండు మూడు వారాల కన్నా ఎక్కువగా వేధిస్తూ, ఛాతిలో నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తితే వెంటనే అర్హులైన జనరల్ ఫిజిషియన్‌ను సంప్రదించి సరైన మందులు వాడాలని ఆరోగ్య నిపుణులు గట్టిగా సలహా ఇస్తున్నారు.