రామాయణం' మూవీ నుంచి భక్తిభరితమైన 'జై జై రామ్' సాంగ్ విడుదల.. ఏఆర్ రెహమాన్ మ్యాజిక్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం 'రామాయణం' నుంచి మేకర్స్ తొలి పాటను అధికారికంగా విడుదల చేశారు. శ్రీరాముడి భక్తి భావాన్ని, దివ్యత్వాన్ని చాటేలా రూపొందించిన 'జై జై రామ్' తెలుగు వెర్షన్ సాంగ్‌ను విడుదల చేయడంతో ఈ సినిమా మ్యూజికల్ జర్నీ ఘనంగా ప్రారంభమైంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఆయన అందించిన దివ్యమైన బాణీలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. రాకేందు మౌళి అద్భుతమైన సాహిత్యం అందించగా, దీపాలి సహాయ్ మరియు రాఘవ్ కౌశిక్ తమ మధురమైన గళంతో ఈ పాటకు ప్రాణం పోశారు.
శ్రీరాముడిని స్మరిస్తూ సాగే ఈ పాటలో అద్భుతమైన ఆధ్యాత్మిక భావాలతో పాటు ఉన్నతమైన సినిమాటిక్ సౌండ్ అందించినట్లు మేకర్స్ తెలిపారు. శ్రీరాముని కరుణ, ధర్మతత్వాలను పాటలోని పదాలు ఎంతో చక్కగా ప్రతిబింబిస్తాయని, పదే పదే వినిపించే 'జై జై రామ్' నామస్మరణ శ్రోతలలో భక్తి భావాన్ని నింపుతుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, రామాయణం కేవలం ఒక దృశ్య కావ్యమే కాకుండా మన సంస్కృతికి మూలమని, శ్రీరాముడు మన జీవితానికి ఎప్పుడూ మార్గదర్శిగా నిలుస్తాడని అన్నారు. ఈ పాట సినిమాలోని ప్రధాన ఆత్మను, విలువలను ప్రతిబింబించేలా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, శ్రీరాముడి నామస్మరణలోని శక్తిని, ప్రార్థనలోని స్వచ్ఛతను ఈ పాట ద్వారా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశామని తెలిపారు. సంగీత పరంగా ఆత్మీయతను కాపాడుతూనే ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని కలిగించేలా ఈ కంపోజిషన్ రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ పాట ప్రతి ఒక్కరిలో శాంతిని, పవిత్రతను నింపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న 'రామాయణం' చిత్రం నుంచి వచ్చిన ఈ తొలి భక్తి గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.