అనిరుధ్, కావ్యా మారన్ రిసెప్షన్‌లో రజనీకాంత్, అజిత్, ధోనీ సందడి.. తారల పండుగలా వేడుక
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యా మారన్ వివాహ రిసెప్షన్ చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. నవంబర్ 11న గ్రీస్‌లో వీరి వివాహం జరగగా, అనంతరం చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ వేదికగా ఘనంగా రిసెప్షన్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సినీ, క్రీడా, రాజకీయ మరియు వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్, నటుడు అజిత్ కుమార్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఒకే చోట కనిపించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రజనీకాంత్, ధోనీ, అజిత్ ఆప్యాయంగా ముచ్చటించుకున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ధోనీ తన సతీమణి సాక్షితో కలిసి హాజరుకాగా, అజిత్ తన భార్య షాలినితో కలిసి వేడుకలో పాల్గొని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
సినీ రంగం నుంచి నయనతార, విఘ్నేశ్ శివన్, శింబు, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, పూజా హెగ్డే, రమ్యకృష్ణ, ప్రదీప్ రంగనాథన్, లోకేశ్ కనగరాజ్, అట్లీ, శంకర్, నెల్సన్ దిలీప్‌కుమార్ వంటి ప్రముఖులు వేడుకకు విచ్చేశారు. అలాగే క్రీడా లోకం నుంచి కేన్ విలియమ్సన్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, డేనియల్ వెటోరీ, దీప్తి శర్మతో పాటు రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ రిసెప్షన్‌లో సందడి చేశారు.
రెండో రోజు వేడుకల్లో కావ్యా మారన్ తెలుపు రంగు డిజైనర్ గౌనులో మెరవగా, అనిరుధ్ వైట్ బ్లేజర్, బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఆకట్టుకున్నారు. సినీ, క్రికెట్ తారల కలయికతో చెన్నై రిసెప్షన్ వేడుక అపూర్వ ఘట్టంగా నిలిచిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.