పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రారంభం.. ‘పాకెట్ రాకెట్స్’ ఆల్బమ్‌తో నిహారిక కొత్త ప్రయాణం
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: జాతీయ అవార్డు గ్రహీత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తన ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ ‘పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్’ పేరుతో ప్రత్యేక మ్యూజిక్ ఛానల్‌ను ప్రారంభించింది. డిజిటల్ కంటెంట్, సినిమా నిర్మాణంలో తనదైన ముద్ర వేసిన నిహారిక కొణిదెల ఇప్పుడు సంగీత రంగంలోనూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ కొత్త వేదిక ద్వారా తొలి ఆల్బమ్‌గా తాను నిర్మిస్తున్న ‘పాకెట్ రాకెట్స్’ చిత్రంలోని పాటలను విడుదల చేయనున్నారు. సంగీత దర్శకుడు గ్యాని బాణీలు సమకూర్చిన ఈ ఆల్బమ్‌ను వార్నర్ మ్యూజిక్ గ్రూప్‌కు చెందిన డివో మ్యూజిక్ భాగస్వామ్యంతో శ్రోతల ముందుకు తీసుకురానున్నారు.
2015లో ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్రపంచంలో అడుగుపెట్టిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఆ తర్వాత ‘నాన్న కూచి’, ‘మ్యాడ్ హౌస్’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘హలో వరల్డ్’, ‘బెంచ్ లైఫ్’ వంటి ప్రాజెక్టులతో మంచి గుర్తింపు పొందింది. అనంతరం సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో పెద్ద విజయాన్ని అందుకుంది. యదు వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవగా, నిర్మాతగా నిహారిక కొణిదెలకు సైమా 2025, గామా 2025 వేదికల్లో ఉత్తమ తొలి చిత్ర నిర్మాత పురస్కారాలు దక్కాయి. ‘రాకాస’ వంటి ప్రాజెక్టులతో సంస్థ పరిధిని మరింత పెంచుతూనే, ఇప్పుడు స్వంత మ్యూజిక్ ఛానల్ ద్వారా తమ చిత్రాల సంగీతానికి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.
రుద్ర ఆత్రి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాకెట్ రాకెట్స్’ ఒక అర్బన్ డ్రామాగా రూపొందుతోంది. అంజి, యేసు అనే ఇద్దరు యువకుల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో, తమ పరిస్థితులను మార్చుకోవాలనే తపనతో, కలలను నిజం చేసుకునే క్రమంలో వారు జూద ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎదుర్కొనే పరిణామాలను ఆసక్తికరంగా చూపించనున్నారు. ఈ చిత్రంలో త్రినాధ్ వర్మ, నిర్మల్, శ్రియ కొంతం, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిహారిక కొణిదెల సమర్పణలో, మాగ్జిమం సిటీ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, రమేష్ మన్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రం, గ్యాని హై ఎనర్జీ మ్యూజిక్‌తో పాటు కొత్త మ్యూజిక్ ఛానల్ ప్రారంభోత్సవం కారణంగా సినీ, సంగీత వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read: డిసెంబర్లో థియేటర్లలోకి తిరువీర్ ‘భగవంతుడు’.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు