శ్రీ సత్యసాయి తాగునీటి పంప్‌హౌస్ వద్ద ఘనంగా 101వ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు భక్తిపారవశ్యంలో అన్నదాన నారాయణ సేవ.. సేవా కార్యక్రమాలతో మార్మోగిన సాయినామ స్మరణ
తాడిమర్రి సూర్య రిపోర్టర్ :- శ్రీ సత్యసాయి బాబా వారి 101వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి తాగునీటి పంప్‌హౌస్ సిబ్బంది వద్ద భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా వారి చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి, ప్రత్యేక పూజలు, భజనలు, సాయినామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. భక్తులు సాయిరాం నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. భజనలతో ఆ ప్రాంతమంతా సాయిమయం కాగా, భక్తుల హృదయాల్లో భక్తి భావం వెల్లివిరిసింది. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా అన్నదాన నారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబా వారి అమూల్యమైన బోధనలైన “మానవ సేవే మాధవ సేవ”, “అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి” అనే సందేశాలను ఆచరణలో పెడుతూ భక్తులకు, ప్రజలకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదనే సత్యసాయి బాబా వారి సేవా సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అన్నదానం ద్వారా నారాయణుడికి సేవ చేసిన అనుభూతిని భక్తులు పొందారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, సత్యసాయి బాబా చూపిన ప్రేమ, సేవ, త్యాగం, మానవత్వం అనే మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన బోధనలను జీవితంలో ఆచరిస్తూ సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భక్తి, సేవ, సమర్పణ భావాలతో సాగిన ఈ జన్మదిన వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సాయిబాబా ఆశీస్సులు సమస్త మానవాళిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సంతోషాలు వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు. సాయినామ స్మరణతో ప్రారంభమైన వేడుకలు.. అన్నదాన సేవతో పరిపూర్ణతను సంతరించుకున్నాయి.