ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనల సడలింపు
సూర్య అంతర్జాతీయ డెస్క్: విదేశాలకు మకాం మార్చే సంపన్నులపై విధించాలని ప్రతిపాదించిన ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనలను సడలించాలని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి చెందిన బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ కీలక సవరణ ప్రతిపాదించింది. ప్రధానంగా పన్ను రాయితీలు ఎక్కువగా ఉండే పన్ను స్వర్గధామ దేశాలకు తరలివెళ్లే వ్యక్తులకే ఈ పన్నును పరిమితం చేయాలని పార్టీ ఎంపీ యలెంజా లుకాసెల్లి సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. గత పదేళ్లలో కనీసం ఎనిమిదేళ్ల పాటు ఇటలీలో నివసించిన వారు, ఆస్తుల ద్వారా కనీసం 20 లక్షల యూరోల మొత్తం ఆదాయం కలిగిన వారు దేశం వీడి వెళ్లేటప్పుడు ఈ నిబంధన వర్తింపజేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు.
ప్రభావిత పన్ను రేటు సున్నా లేదా ఒక శాతం కంటే తక్కువగా ఉండి, ఇటలీతో తగిన పన్ను సమాచార మార్పిడి యంత్రాంగం లేని దేశాలకు తరలివెళ్లే సందర్భాల్లోనే ఈ పన్ను వసూలు చేయాలనేది సవరణలోని ప్రధాన అంశం. 2027 బడ్జెట్ ముసాయిదాలో ప్రభుత్వం తొలుత రూపొందించిన ప్రతిపాదన ప్రకారం, గత పదేళ్లలో ఆరేళ్ల పాటు ఇటలీలో నివసించి, కనీసం 8 లక్షల యూరోల విలువైన ఆర్థిక ఆస్తులు కలిగిన వ్యక్తులు దేశం విడిచి వెళితే, వారి వాస్తవంగా నగదుగా మారని మూలధన లాభాలపై 26 శాతం పన్ను విధించాలని భావించారు. ఈ నిబంధనలను 2027 జనవరి 1 నుంచి అమలులోకి తీసుకురావాలని యోచించారు.
అయితే ఈ ప్రతిపాదనపై సంపన్నులు, ఆర్థిక సలహాదారులు మరియు సంకీర్ణ భాగస్వామ్య పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇటలీలోకి విదేశీ సంపన్నులను ఆకర్షించేందుకు గతంలో ప్రవేశపెట్టిన పన్ను ప్రోత్సాహక పథకాల ప్రభావాన్ని ఈ ఎగ్జిట్ ట్యాక్స్ దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరించారు. సంకీర్ణంలోని మరో పార్టీ ఫోర్జా ఇటాలియా ఈ పన్ను పరిమితిని 50 లక్షల యూరోలకు పెంచాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తుండగా, లీగ్ పార్టీ కూడా కొన్ని పెట్టుబడి నిర్మాణాలకు మినహాయింపులు ఇవ్వాలని కోరుతోంది.
దేశంలో సంపద కేంద్రీకరణ పెరుగుతున్న నేపథ్యంలో, నిరుపేదలు మరియు మధ్యతరగతి వర్గాల వేతనాలలో స్థబ్ధత నెలకొందని పన్ను సంస్కరణల మద్దతుదారులు వాదిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇటలీ గణాంకాల ప్రకారం ఇటలీలో అత్యంత సంపన్నులైన టాప్ 10 శాతం కుటుంబాల వద్దే 60 శాతానికి పైగా నికర సంపద కేంద్రీకృతమై ఉంది. ఈ ఏడాది చివరి నాటికి బడ్జెట్ ఆమోదం పొందాల్సిన నేపథ్యంలో, పార్లమెంట్‌లో దాఖలైన వేలాది సవరణల మధ్య ఎగ్జిట్ ట్యాక్స్ తుది స్వరూపంపై ఇటలీ రాజకీయ, ఆర్థిక వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది.