త్రివిక్రమ్‌ను 'మా' ఎందుకు ప్రశ్నించట్లేదు.. పూనమ్ కౌర్ సంచలన పోస్ట్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు నటి పూనమ్ కౌర్ మధ్య ఉన్న వివాదం మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్రరూపం దాల్చింది. గత కొన్నేళ్లుగా పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన పూనమ్ కౌర్, తాజాగా నేరుగా దర్శకుడి పేరును ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. తన కుటుంబ బలహీనతలను ఆసరాగా చేసుకుని త్రివిక్రమ్ ఒక ప్రకటన ఇప్పించారని, అయితే ఆ ప్రకటనకు తాను ఎంతమాత్రం కట్టుబడి లేనని ఆమె స్పష్టం చేశారు.
ఈ వివాదంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మౌనం వహించడాన్ని నటి పూనమ్ కౌర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇన్నాళ్లైనా త్రివిక్రమ్‌ను 'మా' అసోసియేషన్ ఎందుకు నిలదీయడం లేదని, ఎవరి కోసం ఎదురుచూస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మరింత మంది అమాయకుల జీవితాలు నాశనం అయ్యే వరకు వేచి చూస్తారా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను నేరుగా నిలదీశారు.
సమస్యలు వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోయి, తిరిగి అవసరం వచ్చినప్పుడు వాడుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పూనమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలోని దర్శకుల బారి నుంచి నటీనటులు మరియు నిర్మాతలను దేవుడే కాపాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ వర్గాల్లో మరియు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Also Read: ఓటీటీలోకి 'ప్రేమలు' నటుడి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే!