భరించలేని అనారోగ్య బాధలు.. కారుణ్య మరణం పొందిన 43 ఏళ్ల ప్రముఖ నటుడు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అంతర్జాతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్రెంచ్ నటుడు మరియు నాటక దర్శకుడు ఆర్నాడ్ డెనిస్ (43) తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడలేక కారుణ్య మరణం (యూతనసియా) ద్వారా తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా శరీరం సహకరించక, భరించలేని నొప్పితో బాధపడుతున్న ఆయన బేల్జియంలో వైద్యుల అనుమతితో ఈ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన మరణానికి ముందు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన హెర్నియా శస్త్రచికిత్స వికటించడంతో ఆర్నాడ్ డెనిస్ ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. ఆ సర్జరీలో భాగంగా అమర్చిన మెష్ ఇంప్లాంట్ కారణంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకి, శరీరం మొత్తం విపరీతమైన నొప్పులు ప్రారంభమైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ప్రత్యేకంగా మరో శస్త్రచికిత్స చేసి ఆ ఇంప్లాంట్‌ను తొలగించినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదని, కనీసం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని ఆయన గతంలో వాపోయారు. వైద్యుల ప్రయత్నాలు విఫలమవడంతో పాటు మనిషిగా జీవించే హక్కును కోల్పోయానని భావించిన ఆయన, ఇక ఈ నొప్పులను భరించలేనంటూ కారుణ్య మరణం వైపు మొగ్గు చూపారు.
తన చివరి సోషల్ మీడియా సందేశంలో తన సుదీర్ఘ పోరాటం గురించి, వైద్యపరంగా ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి ఆర్నాడ్ డెనిస్ ఎమోషనల్‌గా పంచుకున్నారు. బేల్జియంలోని నామూర్ నగరంలో ముగ్గురు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చట్టబద్ధంగా యూతనసియా ప్రక్రియ పూర్తియినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కేవలం నటుడిగానే కాకుండా మంచి దర్శకుడిగా పేరు సంపాదించిన ఆర్నాడ్ డెనిస్ అకస్మాత్ మరణం పట్ల ఫ్రాన్స్ సహా పలు దేశాల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.