ఆధార్ చూపిస్తే చాలు మూడు రోజులు సినిమా ఫ్రీ.. 'ఆలోచన' టీమ్ బంపర్ ఆఫర్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో సీనియర్ నటుల కలయికతో రూపొందుతున్న విభిన్న చిత్రం ఆలోచన ప్రేక్షకులకు ఒక వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. జి.వి. నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, రాజన్ హరి, జయలలితతో పాటు ప్రముఖ హాస్యనటుడు సుధాకర్ తనయుడు బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. సురేందర్ చాచా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం ప్రేక్షకులకు, ముఖ్యంగా వృద్ధులకు ఒక ప్రత్యేక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని విడుదలైన తొలి మూడు రోజుల పాటు అంటే నవంబర్ 27, 28, 29 తేదీలలో పూర్తిగా ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ సదుపాయం కేవలం 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తిస్తుందని మేకర్స్ స్పష్టం చేశారు. అరవై ఏళ్లు దాటిన వారు థియేటర్ వద్ద తమ వయసును నిర్ధారించే ఆధార్ కార్డు చూపిస్తే ఎలాంటి టికెట్ లేకుండానే సినిమాను వీక్షించవచ్చు.
మిగతా ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ చిత్ర టికెట్ ధరను కేవలం వంద రూపాయలుగానే నిర్ణయించినట్లు ఎస్‌కే పిక్చర్స్ ద్వారా సినిమాను విడుదల చేస్తున్న సురేష్ కొండేటి తెలిపారు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తుండటం విశేషం. అద్వైక జెస్సీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వియాన్ సంగీతం అందించగా, టి. సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.
కుటుంబ విలువలు, మనుషుల మధ్య అనుబంధాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కిన ఆలోచన చిత్రం పెద్దలతో పాటు యువత కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా అని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. టికెట్ ధరను తగ్గించడమే కాకుండా సీనియర్ సిటిజన్లకు మూడు రోజుల పాటు ఉచిత ప్రదర్శన ఏర్పాటు చేయడం సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.
Also Read: అనిరుధ్-కావ్య రిసెప్షన్.. ధోనితో విజయ్-రష్మిక సందడి