మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి నివాసితులకు ఇంటి పట్టాలివ్వాలి
ప్రభుత్వ భూమిని విక్రయిస్తే ప్రజా పోరాటాలు తప్పవు: గాధగోని రవి
హఫీజ్ పెట్,మేజర్ న్యూస్ :శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నెంబర్లు 100, 101లో ఉన్న 550 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించకుండా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని, స్టాలిన్ నగర్, ముజఫర్ అహ్మద్ నగర్ కాలనీలలో నివసిస్తున్న పేదలకు ఇంటి పట్టాలిచ్చి చట్టబద్ధత కల్పించాలని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న స్టాలిన్ నగర్, ముజఫర్ అహ్మద్ నగర్ కాలనీలను సందర్శించి, స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గాధగోని రవి మాట్లాడుతూ 1994లో అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శాసనసభలో ఈ భూముల ఆక్రమణలపై ప్రభుత్వాన్ని నిలదీశారని గుర్తుచేశారు. 1996లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ఈ భూములు ప్రభుత్వానికి చెందినవిగా నిర్ధారించిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కాలనే లక్ష్యంతో గతంలో అనేక ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు.ప్రభుత్వ భూములను విక్రయించి ఆదాయం సమకూర్చుకోవడం కాకుండా, ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఇంటి పట్టాలిచ్చి చట్టబద్ధత కల్పించాలని, మిగిలిన భూమిని ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జి. నరసింహారావు మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల విక్రయాలను నిలిపివేసి ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పేదల నివాసాలకు భంగం కలిగిస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు జె.వి. చలపతిరావు మాట్లాడుతూ, పేదల నివాస హక్కుల కోసం వామపక్ష పార్టీలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.
సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు హన్మేష్, ఎస్‌యూసీఐ(సి) రాష్ట్ర కమిటీ సభ్యుడు జానీ పాషా మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించకుండా ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యు) పొలిట్‌బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, మోర్తాల చంద్రరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, వి. తుకారాం నాయక్, పానుగంటి నరసయ్య, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి మైదంశెట్టి రమేష్, సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ తదితర వామపక్ష నాయకులు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.