దక్షిణ కొరియా ఎగుమతుల్లో చారిత్రాత్మక రికార్డు
సూర్య అంతర్జాతీయ డెస్క్: అంతర్జాతీయ వాణిజ్య రంగానికి దిక్సూచిగా భావించే ఆసియా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దక్షిణ కొరియా ఎగుమతుల్లో ఊహించని సంచలనం నమోదైంది. గడిచిన అక్టోబర్ నెలలో ఆ దేశ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 93.7 శాతం మేర పెరిగి 115.28 బిలియన్ డాలర్లకు చేరాయి. 1974 జనవరి తర్వాత అంటే దాదాపు 52 ఏళ్ల సుదీర్ఘ కాలంలో దక్షిణ కొరియా సాధించిన అతిపెద్ద వార్షిక ఎగుమతుల వృద్ధి రేటు ఇదే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిశ్రమ రంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు, పెరుగుతున్న సాంకేతిక అవసరాలే ఈ సంచలన వృద్ధికి ప్రధాన కారణమని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఎగుమతుల విభాగంలో ప్రధానంగా సెమీకండక్టర్ల పాత్ర అత్యంత కీలకమైనదిగా నిలిచింది. ప్రపంచ స్థాయి బహుళజాతి ఐటీ దిగ్గజాలు ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా పెట్టుబడులు పెట్టడంతో సెమీకండక్టర్ ఎగుమతులు ఊహించని రీతిలో 259.4 శాతం చొప్పున పెరిగాయి. సర్వర్ అవసరాలు పెరగడం వల్ల కంప్యూటర్లు మరియు సంబంధిత విడిభాగాల విక్రయాలు ఏకంగా 496.6 శాతానికి పైగా వృద్ధి చెందాయి. వీటితో పాటు స్థానిక శరదృతువు సెలవులైన 'చుసయోక్' సమయాల్లో మార్పుల వల్ల పనిదినాలు పెరగడం కూడా ఈ వృద్ధి రేటు గణనీయంగా పెరిగేందుకు దోహదపడింది.
అమెరికా, చైనా వంటి అగ్రదేశాలకు దక్షిణ కొరియా చేసిన ఎగుమతులు భారీ స్థాయిలోనే నమోదయ్యాయి. అమెరికాకు జరిగే ఎగుమతులు 185.8 శాతం వృద్ధి చెందగా, చైనాకు చేసిన ఎగుమతుల్లో 133.6 శాతం పెరుగుదల కనిపించింది. ఇదే సమయంలో ఆ దేశ దిగుమతులు కూడా 36 శాతం పెరిగి 72.78 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మొత్తంగా అక్టోబర్ నెలలో దక్షిణ కొరియా 42.50 బిలియన్ డాలర్ల మిగులు వాణిజ్యాన్ని సాధించింది. ఈ రికార్డు ఎగుమతులు గ్లోబల్ టెక్నాలజీ డిమాండ్‌ను ప్రతిబింబించడమే కాకుండా గ్లోబల్ ఎకానమీలో సరికొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి.