విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం
విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : స్వయం సహాయక సంఘాల మహిళలు తమ పిల్లలను సురక్షితంగా చూసుకునేందుకు విజయవాడ నగరంలో ఐదు అర్బన్ క్రెచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. బుధవారం ప్రధాన కార్యాలయంలో డోనర్ సంస్థల ప్రతినిధులు, ప్రాజెక్ట్ మేనేజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా కొత్త రాజరాజేశ్వరిపేటలో ఒక క్రెచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో క్రెచ్‌లో ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక సహాయకుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఐదు క్రెచ్‌లకు అవసరమైన 10 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు సహాయకులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. మొత్తం రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి డోనర్ సంస్థ ఐఎంసీ సెక్యూరిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.45 లక్షలు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థతో కలిసి సామాజిక కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో అదనపు కమిషనర్ ప్రాజెక్ట్స్, యూసీడీ ప్రాజెక్ట్ అధికారి డా. డి. చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.