వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ
విజయవాడ, మేజర్ న్యూస్ : వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు, జేఏసీ కో చైర్మన్ ఎన్. పెద్దన్న తదితరులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏలు 22 రోజులుగా రెవెన్యూ విధులకు సహాయ నిరాకరణ చేస్తున్నారని, దీంతో రెవెన్యూ, భూ పునఃసర్వే పనులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. వీఆర్ఏల వేతన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ హామీ ఇచ్చారు. వీఆర్వోల పదోన్నతులు, నిష్పత్తి తదితర సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. గ్రేడ్–2 వీఆర్వోలకు స్వయంచాలక వేతన పురోగతి అమలు చేసేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రెవెన్యూ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తామని వీఆర్ఏ జేఏసీ నాయకులు తెలిపారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.