మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి..
దాతలు ముందుగా కలెక్టరేట్ (9154970454) నంబరులో సంప్రదించండి
భక్తుల ఆరోగ్యం, భద్రత విషయంలో భాగస్వాములుకండి
విజయవాడ, మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ప్రభుత్వం అన్ని విధాలా పటిష్ట ఏర్పాట్లు చేస్తోందని.. అయితే మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కూడా భక్తులకు బిస్కట్లు, ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేస్తుంటారని.. అయితే ఇలా పెద్ద మనసుతో, భక్తిభావంతో భక్తులకు ఆహార సేవ చేసేందుకు ముందుకొచ్చే వారు తొలుత కలెక్టరేట్ (91549 70454) నంబరులో సంప్రదించి, నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారమిక్కడ ఓ ప్రకటనలో కోరారు. భక్తుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలను అధికారుల ధ్రువీకరణ అనంతరం నిర్వహించాలన్నారు. స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చే వారికి అధికారులు తగిన మార్గదర్శకత్వం అందించడంతో పాటు, అవసరమైన భక్తులకు ఆహార పదార్థాలు చేరేలా సమన్వయం చేసి సహాయ సహకారాలు అందిస్తారని వివరించారు. అమ్మవారి సేవలో భక్తులు నిమగ్నమై ఉంటే.. ఆ భక్తులకు సేవలందిస్తున్న అధికార యంత్రాంగానికి సహకరిస్తూ, దసరా మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు కీలక భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.