విద్యుత్ పునరుద్ధరణ పనులు వారం రోజుల్లోనే పూర్తి చేయడమే లక్ష్యం --విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక చర్యలు
పాలకొల్లు, మేజర్ న్యూస్ :ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణ పరిస్థితుల్లో సుమారు 30 రోజులు పట్టే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను కేవలం ఏడు రోజుల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో విద్యుత్ శాఖ అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కడా జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ పునరుద్ధరణ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం పాలకొల్లులోని ఏఎంసీ ఇండోర్, పూలపల్లి, అడవిపాలెం విద్యుత్ కేంద్రాలను మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి చేపడుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా సిబ్బంది మరింత వేగంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా అందించడమే ప్రాధాన్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు.ఆర్నాబ్ తుఫాన్ కారణంగా గోదావరి జిల్లాల్లో విద్యుత్ రంగం తీవ్రంగా అస్తవ్యస్తమైంది. వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, విద్యుత్ తీగలు తెగిపోవడంతో పాటు అనేక ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం విద్యుత్ శాఖకు పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో సాధారణంగా నెల రోజుల సమయం పట్టే పునరుద్ధరణ పనులను వారం రోజుల్లోనే పూర్తి చేసేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున యంత్రాలు, అవసరమైన సామగ్రిని సమకూర్చడంతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యుత్ శాఖ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని మంత్రి వివరించారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు కృషి చేస్తున్న సిబ్బంది సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు విద్యుత్ కష్టాలు తొలగించేందుకు నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందితో మంత్రి నిమ్మల రామానాయుడు మమేకమయ్యారు. విధుల్లో ఉన్న విద్యుత్ శాఖ సిబ్బందికి స్వయంగా టిఫిన్ వడ్డించి వారి కష్టాన్ని గుర్తించి అభినందించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సేవలు అభినందనీయమని, ప్రజలకు సేవలందించే క్రమంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతర పర్యవేక్షణ, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో ఇప్పటికే పాలకొల్లులోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరిగే వరకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, కూటమి నాయకులు గ్రామాల్లో పునరుద్ధరణ పనులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.
మరోవైపు తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న వరి పొలాలు, కొబ్బరి చెట్లతో పాటు ఇతర పంట నష్టాలను పరిశీలించి పరిహారం ప్రకటించడం రైతుల్లో భరోసా నింపిందని మంత్రి పేర్కొన్నారు.
తుఫాన్ అనంతరం విద్యుత్ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు చూపుతున్న చొరవ, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది చేస్తున్న నిరంతర శ్రమపై ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఎదురవుతున్న విద్యుత్ ఇబ్బందులను వీలైనంత త్వరగా తొలగించి సాధారణ సరఫరాను పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం, విద్యుత్ శాఖ సమష్టిగా ముందుకు సాగుతున్నాయి.