విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా విద్యాచక్రం.
కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి రంగస్వామి :
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశం గర్వించదగిన నాయకుడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. శుక్రవారం కుందుర్పి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అమిలినేని విద్యాచక్రం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తొమ్మిదో, పదో తరగతులతో పాటు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఒకేరోజు 600 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేయగా, నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 7,300 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి, వారి ప్రయాణ భారాన్ని తగ్గించడంతో పాటు చదువుకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల కనీస అవసరాలు, విద్యార్థులకు అవసరమైన వసతులపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తూ విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తమ కుటుంబం ఇప్పటికీ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోందని, తమకు చేతనైనంత సాయం చేయడమే తమకు తెలుసని అమిలినేని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానని, దోచుకోవడానికి, దాచుకోవడానికి రాలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో విద్యార్థుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలకు ఎస్సార్సీ ట్రస్ట్, సంస్థకు చెందిన సుమారు 7,000 మంది సిబ్బంది సహకారం అందిస్తున్నారని తెలిపారు. వారి కృషితో సుమారు రూ.5 కోట్ల విలువైన సైకిళ్లను విద్యార్థులకు అందించగలుగుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఎస్సార్సీ చైర్మన్ ముట్టినేని రాజగోపాల్, వెంకటేష్, మహీధర్ రెడ్డి, యశ్వంత్, నవీన్, ధర్మతేజ, అవినాష్ తదితరులకు, సంస్థ సీఎఫ్‌ఓ షీమాకు కృతజ్ఞతలు తెలిపారు. కుందుర్పమ్మ గిరిప్రదక్షిణను అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని విమర్శిస్తూ, ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం 2028 మార్చి నాటికి బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గం కూడా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.