ఏర్పుమల్లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
పూల పండుగలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు బొంరాస్‌పేట్ మండలం ఏర్పుమల్ల ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో పాఠశాల ఆవరణ పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పాఠశాలకు తీసుకువచ్చారు. వాటిని సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసి, బతుకమ్మ పాటలతో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గ్రామంలోని చెరువు వద్దకు చేరుకుని బతుకమ్మలను నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ ప్రకృతిపై ప్రేమకు, తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు ప్రతీక అని తెలిపారు. విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని పరిచయం చేయడంతో పాటు వాటిపై గౌరవాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందెయ్య, ఉపసర్పంచ్ తిరుపతయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు సర్ధార్, ప్రశాంత్, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్:శ్రీశైలం,బొంరాస్ పేట్, వికారాబాద్ జిల్లా.