andhrapradesh
స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై రేపు కేబినెట్ లో చర్చ
అమరావతి, సూర్య ప్రతినిధి:ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మరియు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు నేపథ్యంలో, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నిబంధనకు లోబడి బీసీ రిజర్వేషన్లను ఏ విధంగా సర్దుబాటు చేయాలనేదానిపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రాజ్యాంగబద్ధమైన మార్గదర్శకాలను పాటిస్తూనే, ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోకుండా ఉండేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను సత్వరమే నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే మంత్రులకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే రేపటి కేబినెట్‌లో తదుపరి కార్యాచరణ, ఎన్నికల షెడ్యూల్, న్యాయపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు జరగబోయే ఈ ఎన్నికలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.