విద్యారంగంలో అన్నమయ్యను ముందంజలో నిలపాలి
- మౌలిక వసతులు,నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
- మిషన్ మార్చి-2027ను పక్కాగా అమలు చేయాలి
- జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచనలు
మదనపల్లె : జిల్లాలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసి,విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు,నాణ్యమైన బోధన అందించేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం పాఠశాల విద్యాశాఖ పనితీరు,విద్యా కార్యక్రమాల అమలు,విద్యార్థులు,ఉపాధ్యాయుల హాజరు,పదో తరగతి ఫలితాల మెరుగుదల,ప్రత్యేక అవసరాలు గల పిల్లల (సీడబ్ల్యూఎస్ఎన్) నమోదు,నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు,పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన,నిధుల వినియోగం,విద్యార్థుల ప్రవేశాలు,బడి బయట ఉన్న పిల్లలు,విద్యార్థుల హాజరు,డ్రాపౌట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
మనబడి,నాడు-నేడు,పీఎం శ్రీ పాఠశాలల నిర్మాణం,మౌలిక వసతుల పనులతో పాటు ఆడిటోరియం నిర్మాణాలను కూడా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మంజూరైన నిధులను నిబంధనల ప్రకారం సకాలంలో వినియోగించి,పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.నిధుల వినియోగం సక్రమంగా జరిగితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి విడత నిధులు సకాలంలో విడుదలయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.మోడల్ ప్రైమరీ స్కూల్స్‌కు సంబంధించిన ఐదు కాంపోనెంట్ల కింద,అలాగే మనబడి–మన భవిష్యత్తు పథకం కింద పాఠశాలల్లో మిగిలి ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుని,అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మేజర్,మైనర్ మరమ్మతు పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.విద్యుత్ సదుపాయం,తాగునీటి వసతి తదితర మౌలిక వసతులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిస్థాయిలో కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు.పనుల వాస్తవ పరిస్థితి,ఎదురవుతున్న సమస్యలు,విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు,మౌలిక వసతుల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి,సమస్యలను గుర్తించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.జిల్లాలో పదో తరగతి ఫలితాల మెరుగుదలకు మిషన్ మార్చి-2027ను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.విద్యార్థుల గైర్హాజరు,డ్రాపౌట్లకు గల కారణాలను గుర్తించి,వాటిని నివారించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు.బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.విద్యాశాఖకు సంబంధించిన ప్రాధాన్యతా కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.విద్యాశాఖకు సంబంధించిన అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ,నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం,సమగ్ర శిక్ష అధికారిణి అనురాధ,ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.