వెల్దుర్తిలో విత్తన శుద్ధి ప్రత్యక్ష ప్రదర్శన.. సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ
వెల్దుర్తి, సూర్య మేజర్ న్యూస్ రబీ సీజన్‌లో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండాలంటే విత్తన శుద్ధి తప్పనిసరి అని కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి (DAO) పి.ఎల్. వరలక్ష్మి స్పష్టం చేశారు. బుధవారం వెల్దుర్తి మండల పరిధిలోని చెరుకులపాడు గ్రామంలో నిర్వహించిన శనగ విత్తు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమక్షంలో విత్తన శుద్ధి చేసే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి, దాని ప్రయోజనాలను వివరించారు.విత్తన శుద్ధి చేయడం ద్వారా భూమి, విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టవచ్చని జెడఏ తెలిపారు. భూమిలో తగినంత తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం చెరుకులపాడులో రాయితీపై సరఫరా చేస్తున్న శనగ విత్తనాల పంపిణీ రికార్డులను ఆమె సమగ్రంగా తనిఖీ చేసి, లబ్ధిదారులకు రాయితీ విత్తనాలను అందజేశారు.
వివిధ గ్రామాలు, పంటల పరిశీలన:
మండలంలోని మల్లేపల్లి, వెల్దుర్తి, బొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లో రబీలో సాగు చేసిన జొన్న, కుసుమ, శనగ పంటలను అధికారులు పరిశీలించారు. అలాగే జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ పథకం కింద నార్లాపురంలో సాగు చేసిన అండు కొర్ర పంటను డీఏవో పర్యవేక్షించి రైతులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పత్తికొండ సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) ఎ. మోహన్ విజయ్ కుమార్, వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి (MAO) ఆర్. అక్బర్ బాషా, రైతు సేవా కేంద్రం సిబ్బంది ప్రమీల, శ్రీకాంత్, భువనేశ్వరి, జ్యోతి మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం