మిట్స్ వర్సిటీలో ఘనంగా భారత వైమానిక దళ దినోత్సవం
- హాజరైన ఎన్‌సీసీ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి
మదనపల్లె : మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం 94వ భారత వైమానిక దళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్‌సీసీ కేర్‌టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మాట్లాడుతూ భారత వైమానిక దళం దేశ సార్వభౌమత్వం,భద్రత,రక్షణలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు.వైమానిక దళ సిబ్బంది తమ ధైర్యసాహసాలు,క్రమశిక్షణ,అంకితభావంతో దేశ రక్షణకు నిరంతరం సేవలందిస్తున్నారన్నారుయువతలో దేశభక్తి,క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,సేవా భావాన్ని పెంపొందించడంలో ఎన్‌సీసీ ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు.ఎన్‌సీసీ క్యాడెట్లు భారత వైమానిక దళం సాధించిన విజయాలు,సాంకేతిక పురోగతి,ఆధునిక రక్షణ వ్యవస్థలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు,భవిష్యత్తులో దేశ సేవకు తమవంతు కృషి చేసేలా లక్ష్యాలను ఏర్పరచుకోవాలన్నారు.ముఖ్యంగా భారత వైమానిక దళంతోపాటు రక్షణ రంగంలో ఉన్న వివిధ కెరీర్ అవకాశాలపై యువతకు అవగాహన కల్పించడంలో ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.కార్యక్రమంలో భాగంగా ఎన్‌సీసీ క్యాడెట్లకు భారత వైమానిక దళం అంశంపై క్విజ్,చిత్రలేఖన పోటీలను నిర్వహించారు.క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొని వైమానిక దళంపై తమ పరిజ్ఞానం,సృజనాత్మకత,దేశభక్తి భావాలను ప్రదర్శించారు.పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్యాడెట్లకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ కేర్‌టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి,ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ క్యాడెట్లు పాల్గొన్నారు.
కె. ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి