స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధత
- జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా,పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లు,ఎస్పీలను ఆదేశించారు.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాల వారీగా చేపట్టిన సన్నద్ధత,ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు అన్నమయ్య జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి,జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ,సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి,డీపీఓ రాధమ్మ,సంబంధిత అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితా,పోలింగ్ స్టేషన్ల మ్యాపింగ్,పోలింగ్ కేంద్రాల గుర్తింపు,ఎన్నికల సామగ్రి సమీకరణ,పోలింగ్ సిబ్బంది నియామకం,బ్యాలెట్ పేపర్ల ముద్రణ,స్టాట్యూటరీ,నాన్-స్టాట్యూటరీ ఫారాల సమీకరణ,భద్రతా ఏర్పాట్లు,బందోబస్తు ప్రణాళిక తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమగ్రంగా సమీక్షించారు.అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించే అంశంపై కలెక్టర్ల నుంచి అభిప్రాయాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలుసుకున్నారు.ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి,సిబ్బంది,ఇతర వనరులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా చేపట్టి,జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.జిల్లాలోని పంచాయతీలు,మున్సిపాలిటీలలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కూడా ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన పోలీసు బందోబస్తు,భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
కె. ఈశ్వర్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి