పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు?
భోగాపురం, సూర్య: అభివృద్ధి పేరుతో తమ భూములను తీసుకుని, పరిహారం చెల్లించే విషయంలో మాత్రం జాప్యం చేయడంపై బైరెడ్డిపాలెం రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన నష్టపరిహారాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాతే అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. గురువారం జీఎంఆర్ సంస్థ పోలీసుల సహకారంతో రోడ్డు పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించగా, బాధిత రైతులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. రైతుల ఆందోళనకు సీఐటీయూ నాయకులు మద్దతుగా నిలిచారు.
* హామీలకే పరిమితమైన పరిహారం
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం బైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతులు తమ భూములను ఇచ్చారు. అయితే, ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ నాయకులు టీవీ రమణ, బి. సూర్యనారాయణ పేర్కొన్నారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు సైతం పరిహారం అందకపోవడం బాధాకరమన్నారు. నష్టపరిహారం కోసం రైతులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కల్పించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
* రెండు నెలలు దాటినా నెరవేరని హామీ
విమానాశ్రయం ప్రారంభానికి ముందు అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టిన సమయంలోనూ రైతులు పరిహారం చెల్లించిన తర్వాతే నిర్మాణం కొనసాగించాలని పట్టుబట్టినట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు. అప్పట్లో జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని నెల రోజుల్లో పరిహారం అందిస్తామని హామీ ఇవ్వడంతో పనులకు అంగీకరించారని వివరించారు. అయితే విమానాశ్రయం ప్రారంభమై రెండు నెలలకు పైగా గడిచినా ఆ హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
* రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం
భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయకుండా నిర్మాణ పనులు కొనసాగించేందుకు ప్రయత్నించడం సరికాదని సీఐటీయూ నాయకులు స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు రైతులు వ్యతిరేకం కాదని, తమ భూములకు చట్టబద్ధంగా రావాల్సిన పరిహారాన్ని కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, సంబంధిత సంస్థ తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాన్ని పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు సీపీఎం, సీఐటీయూ వారి పక్షాన నిలబడి పోరాటానికి అండగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, బాధిత రైతులు పాల్గొన్నారు.