వెల్దుర్తి సీహెచ్‌సీలో అక్టోబర్ 9న మెగా వైద్య శిబిరం: మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలచంద్రారెడ్డి
వెల్దుర్తి సూర్య మేజర్ న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో (CHC) వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలచంద్రారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, డీసీహెచ్‌ఎస్ ఆదేశాల మేరకు, స్థానిక ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ సహకారంతో అక్టోబర్ 9న వెల్దుర్తి సీహెచ్‌సీ ఆసుపత్రి నందు ప్రత్యేక "మెగా వైద్య శిబిరం" నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెల్దుర్తి పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. శిబిరంలో అందుబాటులో ఉండే వైద్యుల ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్స అందించడంతో పాటు పలు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. కావున ప్రజలు, మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మెగా వైద్య శిబిరాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి మండలం కర్నూలు జిల్లా