విజయవాడలో పండుగల సందడి.. సరస్ మేళా, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌తో నగరానికి కొత్త శోభ
దేశం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు విజయవాడ ఆతిథ్యం అందిద్దాం: ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ, మేజర్ న్యూస్ : రానున్న పది రోజుల్లో విజయవాడ నగరం పండుగల వేదికగా మారనుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్–2.0 ఒకే సమయంలో జరగడం విజయవాడ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని తెలిపారు.బుధవారం విజయవాడలోని ఆయన కార్యాలయం లో మీడియాతో మాట్లాడిన ఎంపీ చిన్ని.. సరస్ మేళా, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ తర్వాత విజయవాడలో సరస్ మేళా నిర్వహించడం గర్వకారణమని ఎంపీ అన్నారు. ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు పున్నమి ఘాట్‌లోని సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో సరస్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు.దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులతో సుమారు 650 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు 2,500 మంది ప్రతినిధులు సరస్ మేళాలో పాల్గొననున్నారని వివరించారు. స్టాళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పున్నమి ఘాట్‌లో ఒకవైపు సరస్ మేళా, మరోవైపు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నగరానికి మరింత ప్రత్యేక ఆకర్షణ ఏర్పడుతుందని ఎంపీ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహారాలను పరిచయం చేసే ఫుడ్ ఫెస్టివల్ కూడా సరస్ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెప్పారు.“ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనకు సరస్ మేళా స్ఫూర్తినిస్తుంది. మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు ఇది చక్కటి వేదిక. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలు, కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సరస్ మేళా సాగుతుంది” అని ఎంపీ చిన్ని అన్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్ ఒకే సమయంలో జరగడం విజయవాడ ప్రజలకు మూడు పండుగలు ఒకేసారి వచ్చినట్లేనని ఆయన అన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు విజయవాడకు రానున్నారని, పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందించామని చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనల షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉందన్నారు.తిరుమలకు దేశవ్యాప్తంగా ప్రముఖులు తరలివెళ్లడం ద్వారా ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరింత పెరిగినట్లే, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం దేశంలోని ప్రముఖులు రావడం ద్వారా విజయవాడ ప్రత్యేకత దేశవ్యాప్తంగా మరింతగా చాటిచెప్పే అవకాశం లభిస్తుందని ఎంపీ తెలిపారు.ప్రముఖుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల వల్ల ప్రజలకు కొంత ఇబ్బంది కలగవచ్చని, ప్రజలు, మీడియా సహకరించాలని కోరారు. విజయవాడకు వచ్చే ప్రతి అతిథికి ఆతిథ్యం ఇచ్చేలా నగరంలోని ప్రతి ఇల్లు, ప్రతి వ్యాపార సంస్థను అందంగా అలంకరించుకోవాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు.విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పిల్లలు, యువత కోసం వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని ఎంపీ తెలిపారు. తల్లిదండ్రుల సమక్షంలో సుమారు 50కి పైగా విభాగాల్లో పోటీలు నిర్వహించి, విజయవాడలోని స్థానిక ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమన్నారు. విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా లైవ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా విజయవాడలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రంజీ మ్యాచ్‌కు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు, ప్రముఖులు హాజరుకానుండటం నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు.“సరస్ మేళా విజయవాడకు రావడం మనందరికీ గర్వకారణం. దసరా ఉత్సవాలు, సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్‌ను ప్రజలంతా కలిసి విజయవంతం చేయాలి. దేశం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు విజయవాడ ఆతిథ్యాన్ని చాటిచెప్పాలి. ప్రజలు, మీడియా, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను” అని ఎంపీ కేశినేని చిన్ని విజ్ఞప్తి చేశారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.