వెల్దుర్తి సర్పంచ్ పీఠంపై 'చతుర్ముఖ పోటీ..? వేడెక్కిన పట్టణ రాజకీయం ....
ఓటర్ల నాడి పట్టేందుకు ముమ్మరంగా ప్రచార వ్యూహాలు.…
హామీల వర్షం కురిపిస్తున్న నేతలు.…
ఆసక్తిగా మారిన సర్పంచ్ ఎన్నికల సమరం …
(వెల్దుర్తి, రూరల్ న్యూస్): వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ అయిన వెల్దుర్తి సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఈసారి 'చతుర్ముఖ' పోటీ నెలకొంది. నామినేషన్ల ఘట్టం వేయకముందే బరిలో నలుగురు అభ్యర్థులు మిగలడంతో గ్రామంలో ఎన్నికల రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ప్రధాన పార్టీల మద్దతుదారులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం హోరాహోరీగా తలపడుతుండటంతో ఈ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఎవరి వ్యూహాలు వారివే..
బరిలో ఉన్న నలుగురు అభ్యర్థులు తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అధికార పక్షం మద్దతుదారులు తాము చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తుండగా, మరోవైపు ప్రతిపక్ష మద్దతుదారులు స్థానిక సమస్యల పరిష్కారమే తమ ఎజెండాగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక మిగిలిన ఇద్దరు అభ్యర్థులు యువత తటస్థ ఓటర్లే లక్ష్యంగా ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయం నుంచే కాలనీలు, వీధుల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
కీలకం కానున్న సామాజిక సమీకరణాలు..
వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో ఇక్కడ ఓటర్ల సంఖ్య దాదాపు 12 వేలకు పైగా ఉంది. నలుగురు అభ్యర్థులు బరిలో ఉండటంతో ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత మహిళా ఓటర్ల తీర్పు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకం కానుంది. సామాజిక వర్గాల వారీగా మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి మంతనాలు జరుపుతున్నారు.
ప్రధాన సమస్యలే ఎజెండా..
గ్రామంలో తాగునీటి సరఫరా, అంతర్గత రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల కల్పనపై ఓటర్లు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, ఇకపై జరగాల్సిన పనులపై ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఏ అభ్యర్థి తమ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలరనే కోణంలో ఓటర్లు ఆలోచిస్తున్నారు.
మొత్తానికి వెల్దుర్తి సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. నలుగురు అభ్యర్థుల మధ్య జరుగుతున్న ఈ హోరాహోరీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే డిసెంబర్ రెండవ తేదీ వరకు వేచి చూడాల్సిందే..!